ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 6:39 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానం.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం.. ఫోటోగ్రాఫర్లకు ఘన సన్మానం
అర్జున్ సమాచారం, ఆగస్టు 19, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (కొమరం భీం)

ఆసిఫాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆసిఫాబాద్ ఆధ్వర్యంలో స్థానిక ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించారు. ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందిస్తున్న ఫోటోగ్రాఫర్లను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక దృశ్యాన్ని కెమెరాలో బంధించడం మాత్రమే కాదని, ఒక సంఘటనను, ఒక జ్ఞాపకాన్ని, ఒక భావోద్వేగాన్ని భవిష్యత్ తరాలకు అందించే గొప్ప కళ అని పేర్కొన్నారు. సమాజంలో జరిగే ముఖ్యమైన సంఘటనలు, ప్రజా సమస్యలు, సామాజిక కార్యక్రమాలు, ప్రకృతి అందాలు, ప్రజల జీవన విధానాలను చిత్రాల రూపంలో భద్రపరచడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.

వార్తా రంగంలో ఫోటోగ్రాఫర్ల సేవలు ఎంతో విలువైనవని అన్నారు. ఒక మంచి ఫొటో వందల పదాల్లో చెప్పలేని విషయాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు వార్తలను మరింత ప్రభావవంతంగా చేరవేయడంలో జర్నలిస్టులతో పాటు ఫోటోగ్రాఫర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఫోటోగ్రఫీ రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. డిజిటల్ కెమెరాలు, మొబైల్ ఫోటోగ్రఫీ, డ్రోన్ ఫోటోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి రావడంతో ఈ రంగానికి మరింత ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యంతో సమాజంలోని మంచి విషయాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యలను కూడా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా మంచి కట్ల. నర్సయ్య (చిన్న ఫోటో స్టూడియో), సంతోష్ (రాఘవేంద్ర స్టూడియో), సమీర్, సందీప్ తదితర ఫోటోగ్రాఫర్లను ఘనంగా సన్మానించి అభినందించారు. ఫోటోగ్రాఫర్ల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్ అబ్దుల్ ఫయాజ్ (క్యాబినెట్ మెంబర్), లయన్ శంకర్ (క్లబ్ అడ్మినిస్ట్రేటర్), లయన్ బోయిర్ ప్రకాష్ (సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు.